రాహుగ్రహ దేవాలయం - తిరునాగేశ్వరం :ఇది భారతదేశంలో ప్రత్యేకంగా రాహుగ్రహ మూర్తి కోసం నిర్మించబడిన అతిపెద్ద ఆలయం
కుంభకోణానికి 5 k.m దూరంలో ఉన్న తిరునాగేశ్వరం గ్రామంలో ప్రాచీనమైన రాహు గ్రహ ఆలయం ఉంది. ఇది భారతదేశంలో ప్రత్యేకంగా రాహుగ్రహ మూర్తి కోసం నిర్మించబడిన అతిపెద్ద ఆలయం. ఈ ఆలయంలోని ప్రధాన దేవతను భక్తులు "నాగనాథన్" అనే పేరుతో పూజిస్తారు.
ఈ పవిత్ర క్షేత్రంలో రాహువు పరమేశ్వరుని భక్తితో ప్రార్థించి, ఆయన దర్శనం పొందాడని చెబుతారు. ఈ కారణంగా ఈ స్థలానికి తిరునాగేశ్వరం అనే పేరు వచ్చింది. పురాణాల ప్రకారం, నలుడు, గౌతమ మహర్షి, పంచపాండవులు, పరశురాముడు, ఇంద్రుడు, సూర్యదేవుడు వంటి మహర్షులు, దేవతలు ఇక్కడ పూజలు నిర్వహించినట్టు చెబుతారు.
ఈ ఆలయంలో భక్తులకు ప్రత్యేకంగా రాహుగ్రహానికి సంబంధించిన పూజా సామగ్రి, వెండితో చేసిన నాగపడగలు లభిస్తాయి. ప్రతిరోజూ రాహుకాల సమయంలో రాహు దోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ఆలయ గోపురానికి బంగారు ఆవరణం ఉండటం వల్ల ఇది కాశీలోని విశ్వేశ్వరస్వామి ఆలయాన్ని తలపిస్తుంది.
ఈ దేవాలయంలో ఒక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, రాహుకాల సమయంలో మాత్రమే క్షీరాభిషేకం చేయడం విశేష ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఆ సమయంలో పాలను రాహు మూర్తి శిరస్సుపై పోస్తే, అవి కంఠభాగానికి చేరే సరికి నీలి రంగులోకి మారతాయి. ఇది ఇతర సమయాల్లో జరగదు. ఈ మహిమను స్వయంగా చూడాలని భక్తులు ఆసక్తిగా రాహుకాల సమయంలో క్షీరాభిషేకం నిర్వహించేందుకు పెద్ద సంఖ్యలో హాజరవుతారు.
Comments
Post a Comment